ఆ 85మందికి అండగా ఉంటా.. వీడియో కాల్ చేసి నందమూరి బాలయ్య మద్దతు

హిందూపురంలో మున్సిపల్ కార్మికుల ఆందోళన.. తమను విధుల నుంచి తొలగించడంపై నిరసన వ్యక్తం చేశారు. తమకు మద్దతు తెలపాలని ఎమ్మెల్యే నందమూరి బాలయ్యను కోరిన కార్మికులు. వీడియో కాల్‌లో మాట్లాడి మద్దతు ప్రకటించారు.

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో 85 మంది మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల తొలగింపు వ్యవహారం దుమారం రేపుతోంది. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ కార్మికులు మున్సిపల్ కార్యాలయం దగ్గర ఆందోళన చేపట్టారు.అయితే కార్మికులపై మున్సిపల్ చైర్ పర్సన్ ఇంద్రజ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కార్మికులు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని.. తమకు సహకారం అందించాలని మొరపెట్టుకున్నారు.

మున్సిపల్ కార్మికులకు వీడియో కాల్ ద్వారా మాట్లాడిన ఎమ్మెల్యే బాలయ్య.. వారికి మద్దతు తెలిపారు. మున్సిపల్ కార్మికులకు న్యాయం జరిగేంత వరకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అధికారులతో మాట్లాడి ఈ సమస్యకు పరిష్కారం అయ్యేందుకు తనవంతుగా ప్రయత్నం చేస్తానన్నారు. తమకు మద్దతు తెలిపినందుకు కార్మికులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.

కరోనా విపత్కర సమయంలో పారిశుద్ధ్య కార్మికుల కొరత ఉండటంతో హిందూపురం మున్సిపాలిటీలో 85 మంది నూతనంగా విధుల్లోకి తీసుకున్నారు. గత నెల మార్చిలో వారిని వేతనాలు ఇవ్వకుండా ఉన్నపళంగా విధుల నుంచి తొలగించారని వారు ఆరోపిస్తున్నారు. ఐదు రోజులుగా తాము సమ్మె, నిరసనలు చేస్తున్నా ఏ ఒక్క అధికారి, అధికార పార్టీ నాయకులు వచ్చి పరామర్శించిన పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

తమకు న్యాయం చేయాల్సిన మున్సిపల్ ఛైర్ పర్సన్ ఇంద్రజ తిరిగి టెంట్ దగ్గరకు వచ్చి ఆగ్రహం వ్యక్తం చేశారని వాపోయారు. ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు, బీజేపీ కౌన్సిలర్ సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులకు మద్దతు తెలిపారు. వారికి న్యాయం చేసేంత వరకు అండగా ఉంటామని తెలిపారు.
About the Author

Leave a Reply

*