ఏపీ సర్కారుపై మున్సిపల్ ఉద్యోగుల ఫైర్… జులై 11 నుంచి సమ్మెబాట

ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్ శాఖలో సమ్మె సైరన్ మోగనుంది. మున్సిపల్‌ కార్మికులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం అంశంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ వచ్చే నెల 11 నుంచి నిరవధిక సమ్మె చేపట్టాలని నిర్ణయించినట్లు మున్సిపల్ కార్మికులు, ఉద్యోగ సంఘాల ఐకాస ప్రకటించింది. గురువారం విజయవాడలో నిర్వహించిన సమావేశంలో ఐకాస కన్వీనర్‌ కె.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం 2019 ఆగస్టు నుంచి మున్సిపల్‌ కార్మికులకు ఇస్తున్న ఆక్యుపేషనల్‌ హెల్త్‌ అలవెన్సు నిలిపివేయడం సరికాదన్నారు.

ఆరోగ్య భత్యం బకాయిల చెల్లింపుతో పాటు ఇంజినీరింగ్‌ కార్మికులు సహా అందరికీ ఆరోగ్య భత్యం చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు. పారిశుద్ధ్య కార్మికులకు జీతంతో పాటు హెల్త్‌ అలవెన్స్‌ చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా జులై 11 నుంచి సమ్మె చేపట్టాలని ఐకాస సమావేశంలో నిర్ణయించామని.. దీనికి కార్మికులు, ఉద్యోగులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఐకాస నాయకులు పి.సుబ్బారాయుడు, ఇ.మధు, ఎస్‌.శంకర్‌, జి.ప్రసాదు, ఎ.రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు.

About the Author

Leave a Reply

*