కోవిడ్ కల్లోలం.. ఒక్కరోజులో 17 వేల మందికిపైగా కరోనా, 13 మంది మృతి

దేశంలో మళ్లీ కరోనా విజృంభణ మొదలైంది. ఒక్క రోజులో 17 వేలమందికిపైగా కరోనా బారినపడ్డారు. కొత్తగా వైరస్‌తో 13 మంది చనిపోయారు.

దేశంలో మళ్లీ కోవిడ్ ప్రభంజనం మొదలైంది. గడచిన 24 గంటల్లో 17, 336 కేసులు నమోదయ్యాయి. గురువారం కంటే 30 శాతం కేసులు పెరిగాయి. కొత్తగా వైరస్ సోకి మరో 13 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,24,954 కు చేరుకుంది. యాక్టివ్ కేసుల సంఖ్య 88,284కి పెరిగింది.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాలు ప్రకారం రోజువారీ పాజిటివిటీ రేటు 4.32 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 3.07 శాతంగా ఉంది. వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,27,49,056 కు పెరిగింది, అయితే కేసు మరణాల రేటు 1.21 శాతంగా నమోదైంది. ఇక రాష్ట్రాల్లో కూడా కోవిడ్ కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తుంది. మహారాష్ట్రలో గురువారం 5,218 కొత్త కరోనావైరస్ కేసులు రికార్డ్ కాగా.. ఢిల్లీలో 1,934 నమోదయ్యాయి. ముందు రోజు నమోదైన కేసుల సంఖ్య కంటే ఇవి ఎక్కువగానే ఉన్నాయి.

ఇక కరోనా కట్టడి కోసం చేపట్టిన వ్యాక్సినేషన్ డ్రైవ్ కూడా వేగవంతంగా సాగుతోంది. ఇప్పటి వరకు దేశంలో 196.77 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లు పంపిణీ జరిగింది. మరోవైపు కోవిడ్ టెస్ట్‌లను వేగంగా జరుపుతున్నారు. కొత్తగా 4,01,649 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. ఇక ప్రపంచ వ్యాప్తంగ చూసుకుంటే ఒక్క రోజులోనే ఏడు లక్షల 25 వేలకుపైగా ఈ మహమ్మారి బారిన పడ్డారు. మరో 1,650 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 547,326,664కు చేరింది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా బారిన పడి 6,347,476 మంది ప్రాణాలు విడిచారు.

About the Author

Leave a Reply

*