రైల్వే ప్రయాణీకులకు గుడ్‌న్యూస్, డెస్టినేషన్ అలర్ట్ ఫీచర్
ఇండియన్ రైల్వేస్ సర్వీసెస్ ప్రయాణీకుల కోసం సరికొత్త సేవల్ని అందుబాటులోకి తీసుకు వచ్చింది. రైల్లో దూరం ప్రయాణించిన సమయంలో కొన్నిసార్లు వేకువజామున దిగవలసి వస్తుంది. మన డెస్టినేషన్ చివరి స్టేషన్ అయితే పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ మధ్యలోని స్టేషన్ లేదా ఒకటి రెండు నిమిషాలు మాత్రమే ఆగే స్టేషన్ అయితే మాత్రం చాలా ఇబ్బంది. స్టేషన్ రాగానే నిద్ర లేవమేమో అనే ఆందోళనతో మెళకువతోనే ఉండేవారు ఎందరో. ఒకవేళ అనుకోకుండా నిద్రపోయినా స్టేషన్ దాటి వెళ్లిన వారు కూడా ఉంటారు. ఇలాంటి వారి కోసం రైల్వేస్ డెస్టినేషన్ అలర్ట్ వేకప్‌ను తీసుకు వచ్చింది. ప్రయాణీకులు 139కి ఫోన్ చేసి, కస్టమర్ కేర్ సర్వీస్ ద్వారా ఈ అలర్ట్ సదుపాయాన్ని పొందవచ్చును. అప్పుడు దిగాల్సిన స్టేషన్ రావడానికి ఇరవై నిమిషాల ముందే మిమ్మల్ని కాల్ రూపంలో అలర్ట్ చేస్తుంది.
డెస్టినేషన్ అలర్ట్ వేకప్ అలారం ఫీచర్ కోసం తొలుత తమ ఫోన్ నుండి IRCTC నెంబర్ 139కి ఫోన్ చేయాలి. ఆ తర్వాత లాంగ్వేజ్ సెలక్ట్ అవుతుంది. ఆ తర్వాత డెస్టినేషన్ అలర్ట్ కోసం 7 అంకెను ప్రెస్ చేయాలి. ఆ తర్వాత మీ పదంకెల PNR నెంబర్‌ను ఎంటర్ చేయవలసి ఉంటుంది. దీనిని ధృవీకరించుకోవడానికి ఒకటిని డయల్ చేయాలి. ఆ తర్వాత PNR వెరిఫై చేసి, డెస్టినేషన్ అలర్ట్‌ను నిర్ధారణ చేస్తూ ఓ సందేశం వస్తుంది. ఈ సదుపాయాన్ని రాత్రి 11 నుండి ఉదయం 7 వరకు అందుబాటులోకి తెచ్చింది. అంతేకాదు, అలర్ట్ అని స్పేస్ ఇచ్చి PNR నెంబర్‌ను టైప్ చేసి, 139కి సందేశం పంపించడం ద్వారా కూడా ఈ సౌకర్యం పొందవచ్చు.