సామ్ ఆ రకంగా చైతూపై గెలిచిందా?

అక్కినేని నాగచైతన్య- సమంత జంట బ్రేకప్ ని ఇప్పటికీ అక్కినేని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఈ జంట ఎవరికి వారు తమ కెరీర్ ని ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళుతూ బిజీగా గడిపేస్తున్నారు. గతాన్ని మరిచి వర్తమానం భవిష్యత్ గురించి ఆలోచిస్తున్న ఆ ఇద్దరూ ఇప్పుడు పాన్ ఇండియా రేస్ లో సత్తా చాటే ప్రయత్నాల్లో ఉన్నారు.

అయితే సామ్ వర్సెస్ చై అంటూ ఒక సెక్షన్ మీడియా రకరకాల కథనాల్ని వండి వారుస్తోంది. ప్రస్తుతం చైతన్య పాన్ ఇండియా ప్రయత్నాల్లో ఉన్నారు. అందులో భాగంగానే బాలీవుడ్ స్టార్లతో కలిసి మల్టీస్టారర్ల ప్రయత్నాల్లో ఉన్నాడని గుసగుస వినిపిస్తోంది. అటు హిందీ ఆడియెన్ కి చేరువయ్యే ప్రయత్నమిదని కూడా విశ్లేషిస్తున్నారు. అమీర్ ఖాన్ – కరీనా కపూర్ నటించిన లాల్ సింగ్ చద్దాతో చైతూ బాలీవుడ్ లో అరంగేట్రం చేయబోతున్నాడు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు చక్కని స్పందన లభించింది. అయితే ట్రైలర్ లో చైతన్య కనిపించేది కొన్ని క్షణాలే. దీంతో అక్కినేని అభిమానులు తీవ్రంగా నిరాశపడ్డారు. చైతన్యకు ఇది సరైన లాంచ్ కాదంటూ ఒక సెక్షన్ ప్రచారం కూడా చేస్తోంది.

నిజానికి సమంత `ఫ్యామిలీమ్యాన్ 2`తో ఉత్తరాదిన దూసుకుపోయింది. నటిగా పెద్ద సక్సెసై బోలెడంత మైలేజ్ అందుకుంది. సమంత రాజీ అనే ఎల్.టి.టి.ఇ ఉగ్రవాది పాత్రతో మెప్పించింది. అంతేకాదు.. ఫ్యామిలీమ్యాన్ 2  ప్రమోషన్స్ లో సమంతకు దర్శక నిర్మాతలు పెద్ద పీట వేసారు. దీంతో సామ్ కి బోలెడంత గుర్తింపు దక్కింది. సామ్ లుక్ గురించి.. రాజీ పాత్ర లో నటన గురించి అందరూ మాట్లాడుకోవడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. కానీ చైతూ గురించి ఇప్పుడు ఎవరూ మాట్లాడుకోవడం లేదు. లాల్ సింగ్ చద్దాలో అతడి ప్రాధాన్యత ఎంత? అన్నది ప్రశ్నగా మారిందంటూ ఒక సెక్షన్ మీడియా ప్రచారం చేస్తోంది.

నిజానికి లాల్ సింగ్ చద్దాలో చైతన్య పాత్ర చాలా మంది హృదయాలను తాకడం ఖాయం అని అక్కినేని అభిమానులు అంటున్నారు. లాల్ సింగ్ చద్దా అమీర్ ఖాన్ – నాగ చైతన్య నటించిన మల్టీస్టారర్ గా ప్రమోట్ చేయాల్సి ఉందని కూడా సూచిస్తున్నారు. అమీర్ ఖాన్ తన ప్రచారంలో చైతన్యకు తప్పకుండా ప్రాధాన్యతనిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనివల్ల అతడికి పాన్ ఇండియా మార్కెట్లో గ్రిప్ పెరుగుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఏది ఏమైనా చైతూపై సామ్ ఇప్పటికి గెలిచింది. మునుముందు నాగచైతన్య తెలివైన ఎత్తుగడలతో ముందుకు దూసుకెళ్లాల్సి ఉంటుంది. సమంత ఇప్పటికే పలు హిందీ చిత్రాలు వెబ్ సిరీస్ లతో రేస్ లో ఒక రేంజులో దూసుకెళుతోంది.

ఒకరితో ఒకరు కెరీర్ లో పోటీగా..!

బ్రేకప్ తర్వాత సామ్ .. చైతూ ఎవరికి వారు బిజీ బిజీ. వరుసగా అరడజను ప్రాజెక్టులతో ఆ ఇద్దరూ బిజీగా ఉన్నారు. ఇంతలోనే సమంత వర్సెస్ నాగచైతన్య అంటూ ప్రచారం హీటెక్కిస్తోంది. సామ్ నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం `యశోద` ఆగస్టు 12న విడుదలవుతుండడమే దీనికి కారణం. నిజానికి ఆ డేట్ కి ఒక రోజు ముందు అంటే ఆగస్టు 11న నాగచైతన్య నటించిన లాల్ సింగ్ చద్దా విడుదలవుతోంది. అమీర్ ఖాన్ – నాగచైతన్య ప్రధానపాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం మోస్ట్ అవైటెడ్ మూవీగా ఈ ఏడాది విడుదలకు సిద్ధమవుతోంది.

సమంత చిత్రం యశోద టైటిల్ సహా పోస్టర్ లకు చక్కని రెస్పాన్స్ వచ్చింది. ఆగస్ట్ 12న సినిమా విడుదల తేదీని అధికారికం చేశారు మేకర్స్. యశోద చిత్రానికి హరి- హరీష్ ద్వయం దర్శకత్వం వహిస్తున్నారు. శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు. దేశవ్యాప్తంగా అత్యంత  భారీ రిలీజ్ కి సిద్ధమవుతున్న లాల్ సింగ్ చద్దాతో యశోద పోటీపడుతుండడం యాధృచ్ఛికం. అంటే ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వారాంతంలో బాక్సాఫీస్ వద్ద పరోక్షంగా నాగ చైతన్యతో సమంత తలపడనుంది. ఇక ఇదే సమయంలో అఖిల్ నటించిన ఏజెంట్ ని రిలీజ్ చేస్తుండడం మరో ట్విస్ట్ అని చెప్పాలి. ఏజెంట్ ను ఆగష్టు 11 న విడుదల చేసేందుకు టీమ్ ప్లాన్ చేస్తోందన్న గుసగుస మరింతగా వేడెక్కిస్తోంది. సురేందర్ రెడ్డి  ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే చై వర్సెస్ సామ్ వర్సెస్ అఖిల్ వార్ ఆద్యంతం రక్తి కట్టిస్తుంది. ముఖ్యంగా అక్కినేని అభిమానులను ఇది పూర్తిగా కన్ఫ్యూజన్ లోకి నెట్టేస్తుందనడంలో సందేహం లేదు.

ఇంతలోనే తొందరెందుకు..!

ప్రస్తుతానికి ఆ ఇరువురి నడుమా  గొడవలు పెట్టడం సరికాదనేది మరో సెక్షన్ అభిమానుల విశ్లేషణ. ఆ ఇద్దరికీ ఇంకా మంచి భవిష్యత్ ఉంది. ఎవరికి వారు ఇంకా చాలా నిరూపించుకోవాల్సి ఉంటుంది. పాన్ ఇండియా స్టార్ డమ్ అనేది సుదీర్ఘ కాలం నిలబెట్టుకోవాల్సినది. ఇది అంత సులువేమీ కాదు. ఈ విషయంలో ఎవరి ఎత్తుగడ ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం. అయినా ఈ జంట విడిపోయినా మళ్లీ అనవసరంగా గొడవలు పెడుతున్నారు! ఇది సరికాదు! అని ఫ్యాన్స్ ఖండిస్తున్నారు.

About the Author

Leave a Reply

*