దారుణం.. పబ్‌జీ ఆడొద్దన్నందుకు తల్లినే కాల్చి చంపిన 16 ఏళ్ల బాలుడు.. 2 రోజులు ఇంట్లోనే మృతదేహం

Boy Kills Mother Over PUBG: పబ్‌జీ ఎంత పనిచేసింది… ఈ గేమ్‌కి అడిక్ట్ అయిన ఓ బాలుడు ఏకంగా తన తల్లినే చంపేశాడు. గన్‌తో ఆమె తలలో కాల్చి హతమార్చాడు.

Boy Kills Mother Over PUBG: ఈరోజుల్లో పిల్లలు మొబైల్ గేమ్స్‌కి బాగా అలవాటు పడిపోయారు. చేతికి సెల్‌ఫోన్ ఇస్తే చాలు పొద్దస్తమానం గేమ్స్ ఆడుతూ గడిపేస్తున్నారు. మొదట సరదాగా మొదలై ఆ తర్వాత వ్యవసంగా మారే ఈ అలవాటు వల్ల కొంతమంది ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటున్నారు. తిండి, తిప్పలు మానేసి గంటల కొద్ది గేమ్స్ ఆడుతూ అనారోగ్యం పాలవుతున్నారు. ఇలాగే పబ్‌జీ గేమ్‌కి అడిక్ట్ అయిన ఓ టీనేజర్ ఏకంగా తన తల్లినే చంపేశాడు. పబ్‌జీ గేమ్ ఆడకుండా అడ్డుకున్నందుకు ఆమెను గన్‌తో కాల్చి చంపాడు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఈ ఘటన చోటు చేసుకుంది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం… ఆదివారం (జూన్ 5) తెల్లవారుజామున 3 గం. సమయంలో బాలుడు తల్లిని హత్య చేశాడు. ఆమెను గన్‌తో కాల్చి చంపాక ఇంట్లోని ఓ గదిలో దాచాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని.. చెబితే చంపేస్తానని తన చెల్లెలి ని బెదిరించాడు. అలా తల్లి మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టి రెండు రోజులు గడిపాడు. మంగళ వారం (జూన్ 7) రాత్రి 9గం. సమయంలో దీనిపై పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఫోరెన్సిక్ టీమ్‌తో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లారు.

ప్రాథమిక దర్యాప్తులో బాలుడే తన తల్లిని హత్య చేసినట్లు తేలింది. పబ్‌జీ గేమ్ ఆడొద్దని తల్లి అడ్డుకున్నందుకే ఆమెను హత్య చేసినట్లు గుర్తించారు. అంతకుముందు, ఇంట్లో దాచిన డబ్బు కనిపించకపోవడంతో తల్లి బాలుడిని అనుమానించిందని… చివరకు ఆ డబ్బు ఇంట్లోనే దొరికిందని తెలిపారు. డబ్బు దొంగిలించానని తనను అవమానించడంతో పాటు పబ్‌జీ ఆడొద్దని అడ్డుకుంటునే కోపంతో గన్‌తో ఆమెను కాల్చి చంపాడు.

 

తండ్రికి చెందిన లైసెన్స్డ్ గన్‌తో ఆమెను కాల్చి చంపినట్లు పోలీసులు గుర్తించారు. బాలుడు, అతని చెల్లి రెండు రోజుల పాటు మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకుని గడిపినట్లు తెలిపారు. తమ ఇంటికి వచ్చిపోయే ఓ ఎలక్ట్రిషీయనే ఈ హత్యకు పాల్పడినట్లు బాలుడు పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. అయితే పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో బాలుడు నేరం అంగీకరించక తప్పలేదు. ఇంట్లో మృతదేహం ఉన్న రెండు రోజుల పాటు చెల్లెలికి బయట నుంచి ఫుడ్ తీసుకొచ్చాడని.. ఇంట్లో దుర్వాసన రాకుండా ఉండేందుకు రూమ్ ఫ్రెష్‌నర్ స్ప్రే చేశాడని పోలీసులు తెలిపారు. బాలుడి తండ్రి ప్రస్తుతం ఆర్మీలో పనిచేస్తున్నట్లు వెల్లడించారు. బాలుడు నేరం అంగీకరించడంతో అతన్ని అదుపులోకి తీసుకుని జువైనల్ హోమ్‌కు తరలించినట్లు తెలిపారు.

About the Author

Leave a Reply

*