Diet to control uric acid: యూరిక్‌ యాసిడ్ పెరిగిందా.. ఇవి తినండి..

ఈ రోజుల్లో చాలామంది యూరిక్‌ యాసిడ్‌ సమస్యని ఎదుర్కొంటున్నారు. శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ మోతాదు మించితే కడుపులో మంట, కిడ్నీలో రాళ్లు, మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, చేతుల వేళ్లు వాపు, మూత్రపిండాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. . మీ డైట్‌లో కొన్ని ఆహారాలు చేర్చుకుంటే.. యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించడానికి, గౌట్ వంటి వ్యాధులను నివారించడానికి సహాయపడతాయి అవేంటో చూసేయండి.

ఈ రోజుల్లో చాలామంది యూరిక్‌ యాసిడ్‌ సమస్యని ఎదుర్కొంటున్నారు. పేలవమైన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యల్లో శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడం కూడా ఒకటి. శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ మోతాదు మించితే కడుపులో మంట, కిడ్నీలో రాళ్లు, మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, చేతుల వేళ్లు వాపు, మూత్రపిండాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

యూరిక్‌ యాసిడ్‌ అంటే..

యూరిక్‌ యాసిడ్‌… మన శరీరం సహజంగా విసర్జించే వ్యర్థ పదార్థాల్లో ఇది కూడా ఒకటి. మనం తీసుకునే ఆహార పదార్థాల్లోని ‘ప్యూరిన్‌’ అనే రసాయనం విచ్ఛిన్నం చెందినప్పుడు యూరిక్‌ యాసిడ్‌ ఏర్పడుతుంది. ఇది ఎప్పటికప్పుడు మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది. అయితే విసర్జన సరిగా జరగకపోయినప్పుడు యూరిక్‌ యాసిడ్‌ రక్తంలోనే నిలిచిపోతుంది. క్రమంగా ఇవి స్ఫటికాలుగా మారి కీళ్లు, కీళ్ల చుట్టూ ఉండే కణజాలాల్లో పేరుకుపోతాయి. యూరిక్ యాసిడ్ శరీరం నుంచి బయటకు రాలేకపోతే.. కీళ్లనొప్పులు, గౌట్ వ్యాధులు వస్తాయి.

ఎందుకు పెరుగుతుంది..

రక్తంలో యూరిక్ యాసిడ్ పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం, మూత్రవిసర్జన మందులు లేదా నీటి మాత్రలు తీసుకోవడం, అధిక బరువు, సోరియాసిస్, హైపోథైరాయిడిజం మొదలైనవి ఉన్నాయి. లివర్‌, పుట్టగొడుగులు, బఠానీలు, బీన్స్ లాంటివి లాంటి ప్యూరిన్ అధికంగా ఉండే పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ ఎక్కువ అవుతుంది. మీ డైట్‌లో కొన్ని ఆహారాలు చేర్చుకుంటే.. యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించడానికి, గౌట్ వంటి వ్యాధులను నివారించడానికి సహాయపడతాయి అవేంటో చూసేయండి.

నిమ్మరసం..

నిమ్మరసం.. రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతుందని.. 2017లో ఓ అధ్యయనం వెల్లడించింది. శరీరంలో అధిక యూరిక్‌ యాసిడ్‌తో బాధపడేవారు.. 6 వారాల పాటు ప్రతిరోజు తాజా నిమ్మరసం(రోజుకు ఒక నిమ్మకాయ) తాగితే.. మంచి రిజల్ట్స్‌ వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఎర్ర క్యాబేజీ..

యూరిక్ యాసిడ్ అధికంగా ఉన్న పేషెంట్స్‌కు క్యాబేజీ మంచిది కాదని నిపుణులు అంటారు. కానీ.. ఎర్ర క్యాబేజీలో ఫ్లేవనాయిడ్లు ఎక్కువగా ఉంటాయి. అదనంగా దీనికి ఎర్ర రంగును ఇచ్చే.. సైనిడిన్ శరీరంలోని యూరిక్‌ యాసిడ్‌ స్థాయిని తగ్గిస్తుంది. గౌట్‌ సమస్య నుంచి మిమ్మిల్ని రక్షిస్తుంది.

సెలెరీ..

సెలెరీ ఆకుల్లో గౌట్ సమస్యను నివారించే కాంపౌండ్స్‌ ఉంటాయి. ఇందులో ఉండే లుటియోలిన్‌ యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించి నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ యూరిక్ యాసిడ్‌ను తగ్గించడానికి సహాయపడతాయి.

టమాటా..

రక్తంలో అధిక యూరిక్‌ యాసిడ్‌ సమస్యతో బాధపడుతున్నవారు.. వారి డైట్‌లో టమాటా చేర్చుకుంటే మంచిది. యూరిక్‌ యాసిడ్‌ స్థాయిని తగ్గించడంలో టమాటా సహాయపడుతుంది. టమోటాలలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది యూరిక్ యాసిడ్ తగ్గించడంలో మెరుగ్గా పనిచేస్తుంది.

కీరా, క్యారెట్‌..

మీ శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగితే.. క్యారెట్, కీర దోస ఎక్కువగా తీసుకోవాలి. క్యారెట్‌లో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి, ఇవి ఎంజైమ్‌ల ఉత్పత్తిని నియంత్రిస్తాయి. ఈ ఎంజైమ్‌లు రక్తంలో యూరిక్ యాసిడ్ సంశ్లేషణను ప్రోత్సహిస్తాయి. కీరా, క్యారెట్‌లో పీచుపదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలోని యూరిక్ యాసిడ్‌ను తొలగించడంలో ఇవి ఉపయోగపడతాయి.

ఈ జాగ్రత్తలు పాటించండి..

  • శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ ఎక్కువగా ఉంటే.. నీళ్లు ఎక్కువగా తాగాలి. ఉదయం వీలైనంత ఎక్కువగా నీళ్లు తాగాలి. రోజూ కనీసం 2-3 లీటర్ల నీటిని తాగాలి.
  • పాలు, పెరుగు, మజ్జిగ..ఈ మూడు పదార్థాలు రక్తంలో యూరిక్‌ యాసిడ్‌ స్థాయులను తగ్గిస్తాయి. ముఖ్యంగా పెరుగు, ఎండుద్రాక్ష ప్రతిరోజూ తీసుకుంటే ఈ సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు. మజ్జిగ శరీరంలోని నీటి స్థాయులను పెంచడంతో పాటు కండరాలు, కీళ్ల ఆరోగ్యానికి సహకరిస్తుంది.
  • నట్స్‌ నీటిలో నానబెట్టి తీసుకోవాలి. ముఖ్యంగా బాదం, జీడిపప్పు, వాల్‌ నట్స్‌ తీసుకుంటే మంచిది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

About the Author

Leave a Reply

*