Eggs with Blood Spots: గుడ్డు సొనలో రక్తపు మరకలు కనిపించాయా? అలాంటి గుడ్లను తింటే ప్రమాదమా?
Eggs with Blood Spots: మనలో చాలా మంది ప్రతి రోజూ గుడ్లని తింటారు. ఐతే కొన్ని గుడ్ల సొనలో రక్తపు మరకలు అప్పుడప్పుడూ కనిపిస్తుంటాయి. మరి అలాంటి గుడ్లను తింటే ఏమవుతుంది? ఆరోగ్యానికి ఏమవుతుంది?
గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రోటీన్లతో కూడిన బలవర్ధక ఆహారం. అందుకే మనలో చాలా మంది రోజుకు కనీసం ఒక్క గుడ్డు అయినా తింటుంటారు. కొందరైతే వివిధ రూపాల్లో ఒకటి కంటే ఎక్కువ గుడ్లనే తింటారు. ఎగ్ బుర్జి, ఎగ్ కర్రీ, ఆమ్లెట్, బ్రెడ్ ఆమ్లెట్, ఉడికించిన గుడ్డును ఎంతో ఇష్టంగా లాగిస్తుంటారు.
ఐతే మీరెప్పుడైనా గుడ్డు పగలగొట్టిన తర్వాత పచ్చసొనలో ఎర్రటి రక్తపు మరకలను గమనించారా? కొన్నికొన్ని సార్లు మాంసం ముక్కలు కూడా గమనించవచ్చు. ఇలాంటి గుడ్లు తింటే శరీరం ఏమవుతుంది? ఆరోగ్యానికి హానికరమా?
గుడ్డు పచ్చసొనపై రక్తపు మరకలు కనిపిస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గుడ్డును బాగా ఉడికించి తింటే శరీరానికి ఎలాంటి హాని కలగదని నిపుణులు చెబుతున్నారు. దానిని బాగా వేయించినా, ఉడకబెట్టినా.. ఎలాంటి నష్టం ఉండదు. చాలా మంది గుడ్డులోని ఆ రక్తపు భాగాన్ని చెంచాతో తొలగించి వండుతుంటారు. ఇలా చేసినా ఇబ్బంది ఉండదు.
కోడి కడుపులో గుడ్డు అండాశయం గుండా వెళుతున్నప్పుడు.. మాంసం ముక్క లేదా రక్తం తరచుగా దానిలో కలుస్తుంది. అంతేతప్ప అందులో శరీరానికి హాని కలిగించేది ఏమీ లేదు. ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా ఆ గుడ్లను తినవచ్చు.
ఐతే గుడ్డులోని తెల్ల సొన.. గులాబీ, ఎరుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అలాంటి గుడ్డు శరీరానికి చాలా హాని కలిగిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. విషపూరిత బ్యాక్టీరియా ప్రభావాల ఫలితంగా గుడ్ల తెల్లసొన రంగు మారుతుంది. ఈ గుడ్లను వాడకుండా..చెత్తలో పడేయాలి.
సొనలో రక్తపు మరకలు సాధారణంగా 1 శాతం గుడ్లలో మాత్రమే కనిపిస్తాయి. కోడిగుడ్లు మార్కెట్‌లోకి రాకముందే క్యాండిలింగ్ పద్ధతిలో పరీక్షిస్తారు. తెల్ల, పచ్చ సొన లోపలి భాగం ప్రకాశవంతమైన కాంతితో కనిపిస్తుంది. క్యాండిలింగ్ సమయంలోనే రక్తపు మరకలు ఉన్న గుడ్లను విస్తరిస్తారు. అందుకే అవి మన వరకు రావు.
వైట్ కలర్ ఎగ్స్ కంటే.. బ్రౌన్ కలర్ ఎగ్స్‌లో ఇలాంటి రక్తపు మరకలున్న సొన ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే బ్రౌన్ కలర్ షెల్.. ఆ రక్తపు మరకను కప్పివేస్తుంది. అందువల్ల పరీక్షించే సమయంలో కనపడదు. అలాగే మార్కెట్‌కు వచ్చేస్తుంటాయి. ఒకవేళ మీకు అలాంటివి కనిపించినా..ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.