Solar Car: సౌరశక్తితో నడిచే కారు తయారు చేసిన కశ్మీర్ యువకుడు.. లగ్జరీ కార్ల తరహాలో డిజైన్!
పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఏడాది వ్యవధిలో పెట్రో ధరలు పెరిగిన తీరు సామాన్యుల ఆర్థిక కష్టాలను మరింత పెంచింది. ఇంధనలు పెరుగుతుండటంతో చాలా మంది ఎలక్ట్రిక్ బైక్‌లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్లోకి ఎలక్ట్రిక్ కార్లు కూడా వస్తున్నాయి. కానీ వాటి ధర ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో కశ్మీర్‌కు చెందిన ఓ మ్యాథ్స్ టీచర్.. సౌరశక్తితో నడిచే కారుకు రూపకల్పన చేశారు.
శ్రీనగర్‌కు చెందిన బిలాల్ అహ్మద్ ఈ కారు తయారు చేశారు. లగ్జరీ కార్ల తరహాలో ఈ కారు డోర్లు పైకి తెరుచుకోవడం చూసి నెటిజన్లు అతడిపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. కారు బ్యానెట్‌పైన, రూఫ్ మీద.. అద్దాలకు, వెనుకవైపు.. ఇలా కుదిరిన ప్రతి చోటా సోలార్ ప్యానెళ్లను ఆయన ఏర్పాటు చేశారు. వాటి ద్వారా ఉత్పత్తయిన విద్యుత్‌ను కారు నడపడానికి ఉపయోగిస్తున్నారు. కశ్మీర్ వ్యక్తి రూపొందించిన ఈ కారు ఆనంద్ మహీంద్రాను అమితంగా ఆకర్షించింది.
ఈ కారును తయారు చేయడం కోసం బిలాల్ అహ్మద్ పదేళ్లకుపైగా శ్రమంచారు. సామాన్య ప్రజలకు సైతం అందుబాటు ధరలో లభించేలా కారును తీర్చిదిద్దాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.
‘మెర్సిడిస్, ఫెరారీ, బీఎండబ్ల్యూ లాంటి కార్లు సామాన్యుడికి ఓ కల. కొంత మంది మాత్రమే ఖరీదైన ఈ కార్లను కొనుగోలు చేయగలరు. మిగతా వాళ్లంతా అలాంటి కార్లలో తిరగాలని.. వాటిని నడపాలని కలగంటుంటారు. ప్రజలకు లగ్జరీ భావన కలిగేలా చేద్దామని భావనతోనే కారును ఇలా రూపొందించా’ అని అహ్మద్ తెలిపారు.
వాస్తవానికి ఈ కారును వైకల్యంతో బాధపడుతున్న వారి కోసం తయారు చేద్దామని బిలాల్ భావించారు. కానీ నిధుల కొరతతో ఆ ప్లాన్ ముందుకు సాగలేదు. కానీ ఇంధన ధరలు పెరుగుతుండటంతో.. తాను రూపొందించిన కారును ఆయన సోలార్ పవర్‌తో నడిచేలా మార్చేశారు.
11 ఏళ్ల పరిశోధన, శ్రమ అనంతరం బిలాల్ తన కలను సాకారం చేసుకున్నారు. కారు నడవడం కోసం తాను మోనోక్రిస్టలైన్ సోలార్ ప్యానెళ్లను ఉపయోగించానని.. వీటి సాయంతో సూర్యరశ్మి తక్కువ ఉన్నప్పటికీ.. గరిష్టంగా విద్యుత్ ఉత్పత్తి అవుతుందని ఆయన తెలిపారు. ఈ ప్యానెళ్లు సమర్థవంతంగా పని చేయడంతోపాటు తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయన్నారు.
చాలా ఖరీదైన కార్లలో ఇద్దరు మాత్రమే కూర్చునే వీలు ఉంటుండగా.. సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఆయన నలుగురు కూర్చొని ప్రయాణించేలా ఆయన ఈ కారును రూపొందించారు.
పూర్తి ఆటోమెటిక్ అయిన ఈ కారును రూపొందించడం కోసం బిలాల్ రూ.15 లక్షలకుపైగా ఖర్చుపెట్టారు. ఎవరి నుంచి ఆర్థిక సాయం పొందకుండా ఆయన సొంత డబ్బును ఇందుకోసం వెచ్చించారు. ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టినప్పుడే కాదు.. పూర్తయ్యాక కూడా ఎవరూ తనకు ఆర్థిక సాయం చేయలేదని ఆయన చెప్పారు. నాకు ఎవరైనా సపోర్ట్ చేస్తే భారత ఎలన్ మస్క్‌ను అయ్యేవాడిని బిలాల్ చెప్పారు.