TS Inter Results 2022: జూన్ 20 నాటికి తెలంగాణ ఇంటర్ ఫలితాలు..? ఇప్పటికే ప్రారంభమైన మూల్యాంకనం
TS Inter Results 2022: తెలంగాణలో ఇంటర్ పరీక్షలు మంగళవారం (మే 24) తో ముగియనున్న నేపథ్యంలో అధికారులు సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ వేగం పెంచారు. వాస్తవానికి సంస్కృతం పేపర్ మూల్యాంకనం ఈ నెల 12నే ప్రారంభమైంది. తాజాగా ఆదివారం సబ్జెక్టుల మూల్యాంకనం చేపట్టారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మూల్యాంకన కేంద్రాలను ఇంటర్ విద్య కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ పరీశీలించారు. కేంద్రాల్లో ఏర్పాట్లను ఆయన అడిగి తెలుసుకున్నారు.
అలాగే.. మూల్యాంకన విధానంలో పాటించాల్సిన పద్ధతులను వివరించారు. మూల్యాంకనం కోసం ఇంటర్ బోర్డు రాష్ట్రవ్యాప్తంగా 14 కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈసారి ఇంటర్ పరీక్షలు విభిన్నమైన వాతావరణంలో జరిగాయి. కోవిడ్ వల్ల టెన్త్ పరీక్షలు రాయకుండానే విద్యార్థులు ఇంటర్‌లో ప్రవేశాలు పొందారు. ఫస్టియర్ పరీక్షలు లేకుండానే సెకండియర్ కొనసాగించినా.. ఆ తర్వాత మళ్లీ పరీక్షలు పెట్టారు. కానీ 49 శాతం ఉత్తీర్ణత మాత్రమే వచ్చింది. కోవిడ్ వల్ల క్లాసులు జరగకపోవడం వల్లే పాస్ అవలేకపోయామని విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. కొంతమంది ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. దీంతో అందరినీ కనీస మార్కులతో పాస్ చేశారు.
ఇప్పుడు వాళ్లంతా ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాశారు. వీరి కోసం ఇంటర్ బోర్డు ప్రత్యేక స్టడీ మెటీరియల్ అందించింది. పరీక్ష ఫలితాలను (TS Inter Results 2022) జూన్ 20 నాటికి వెల్లడిస్తామని అధికారులు ప్రకటించారు. ఫలితాలు వచ్చిన 15 రోజుల్లో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని వెల్లడించారు.
TS Inter Academic Calendar 2022-23: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. 2022-23 అకడమిక్ క్యాలెండర్ విడుదల.. పరీక్షలు, సెలవుల తేదీలివే
తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఇంటర్మీడియట్ 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. 221 పని రోజులతో విద్యా సంవత్సరాన్ని తెలంగాణ ఇంటర్ బోర్డు ఖరారు చేసింది. తరగతులు, పరీక్షలు, సెలవులకు సంబంధించిన షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు ప్రకటించింది. జూలై 1న ఇంటర్ ఫస్టియర్ తరగతులు ప్రారంభం కానున్నాయి. జూన్ 15న సెకండియర్ తరగతులు ప్రారంభమవుతాయని ఇంటర్ బోర్డు తెలిపింది. అక్టోబర్ 2 నుంచి 9 వరకు ఇంటర్ విద్యార్థులకు దసరా సెలవులు కాగా.. 2023, జనవరి 13 నుంచి 15 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని పేర్కొంది.
అలాగే.. ఫిబ్రవరి 6 నుంచి 13 వరకు ప్రి ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 20 నుంచి మార్చి 6వ వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు జరుగుతాయని.. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4వ వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి మే 31 వరకు వేసవి సెలవులుంటాయని.. జూన్ 1 కాలేజీలు పునఃప్రారంభమవుతాయని పేర్కొంది. 2023 మే చివరి వారంలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. పూర్తి వివరాలను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://tsbie.cgg.gov.in/ లో చూడొచ్చు.