Uttarandhra Cashew Nut: జీడిపప్పుకు ఉత్తరాంధ్ర ఎందుకు ఫేమస్ అయ్యింది

Uttarandhra Cashew Nut

: నాలుగు వందల సంవత్సరాల కిందట ఈ దేశాన్ని ఏలిన ఫోర్చుగీస్ వారు వేసిన విత్తనం అది. ఇంతింతై వటుడింతై అన్న చందంగా విస్తరించింది.

లక్షలాది ఎకరాల్లో సాగు విస్తరించింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తోంది. ఖండాంతర ఖ్యాతిని తెచ్చి పెట్టింది. అదే ఉత్తరాంధ్ర తెల్ల బంగారం జీడిపప్పు. రాష్ట్రంలో మొత్తం 3.31 లక్షల ఎకరాల్లో జీడి సాగవుతోంది. అందులో 90 శాతం ఉత్తరాంధ్రలో సాగవుతోంది. అందున శ్రీకాకుళం జిల్లా మరీ ఫేమస్. ఈ జిల్లా అనగానే ముందుగా గుర్తొచ్చేది అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయం. ఆ తరువాత చటుక్కున గుర్తుకొచ్చేది మాత్రం పలాస జీడి పప్పు. అంతలా ఖ్యాతికెక్కింది ఈ జీడి పప్పు. పలాస జీడిపప్పు ఎంతో కమ్మగా ఉంటుంది. నోటికి రుచికరంగా ఉంటుంది. దీనికి కారణమూ లేకపోలేదు. తీర ప్రాంతంలో ఉండే జీడి చెట్లు సహజసిద్ధ వాతావరణంలో సాగవుతుంటాయి. అందుకే జీడిపప్పుకు రుచి ఎక్కువ.జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ లో డిమాండ్ ఎక్కువ. పలాసకాశీబుగ్గ జంట పట్టణాల్లో సుమారు 380 జీడి పరిశ్రమలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా మరో 180 వరకూ పరిశ్రమలుంటాయి.

Uttarandhra Cashew Nut

మంచి ఆరోగ్యానికి, మన శరీరానికి విటమిన్లు, ఖనిజాలు చాలా పోషకాలు అవసరం. సాధారణ ఆహారంతోనే మనం ఈ పోషకాలన్నీ పొందుతాము. అయినప్పటకీ మంచి పోషక విలువలు లేకపోతే రోగనిరోధక శక్తి మరియు శక్తి స్థాయి తగ్గుతుంది. బలహీనమైన రోగనిరోధక శక్తి అనేక వ్యాధులు మరియు అంటురోగాలకు దారితీస్తుంది. మీరు మీ ఆహారంలో జీడిపప్పని చేర్చుకుంటే, సహజసిద్ధమైన పోషకాల విలువల్ని పెంచుకోవచ్చు. జీడిపప్పులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. జీడిపప్పు, ఎండుద్రాక్ష, బాదం, పిస్తా, వాల్‌నట్స్ లో విటమిన్స్, మినరల్స్, ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. వాటిని క్రమం తప్పకుండా తినడం వల్ల మన పోషక అవసరాలు తీరుతాయి. వాటి నుండి మన శరీరం శక్తిని పొందుతుంది మరియు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అయితే ఇవన్నీ పలాస జీడి పప్పులో ఉన్నాయని నిపుణులు చెబుతుంటారు.

ఇక్కడ సాగు అధికం..

శ్రీకాకుళం జిల్లాలో ఇచ్ఛాపురం, సోంపేట, కంచిలి, మందస, పలాస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, మెళియాపుట్టిలో జీడి సాగు అధికం. అటు పార్వతీపురం మన్యం, పాడేరు, అరకు జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా జీడి సాగవుతోంది. కానీ ప్రధానంగా మాత్రం శ్రీకాకుళం జిల్లాలోని పలాస ప్రాంతంలో జీడి సాగుతో పాటు పప్పు ప్రాసెసింగ్ జరుగుతోంది. విదేశాలకు ఇక్కడ నుంచే జీడిపప్పు ఎగుమతవుతోంది. సగటున ఏడాదికి రూ.5000 కోట్ల వరకూ జీడి పప్పు లావాదేవీలు నడుస్తాయి. ఇందుకుగాను విదేశాలతో డీల్ చేసేందుకు కొంతమంది బ్రోకర్లు సైతం ఉంటారు. ఉత్తరాంధ్ర వ్యవహారంలో ఒక మాట వినిపిస్తుంది. అర్జెంటుగా కోటి రూపాయలు కావాలంటే అక్కడా ఇక్కడా కష్టం కానీ..పలాసలో మాత్రం ఒక గంటలో సాధ్యమని దీనికి కారణం అక్కడ ఉన్న జీడి పరిశ్రమలు. అంతలా జరుగుతాయి అక్కడ లావాదేవీలు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఇక్కడి వ్యాపారులను బినామీలుగా చేసుకొని పెట్టుబడులు పెడుతుంటారు. వారికి తక్కువ వడ్డీకి అప్పులు ఇస్తుంటారు. జీడి వ్యాపారులంతే అంత నమ్మకం. రాజకీయ నాయకుల హవాలా డబ్బు అంతా పలాస జీడి పరిశ్రమల్లోనే ఉందన్న నాన్నుడి దశాబ్దాలుగా ఇక్కడ ఉంది.

అదో జంబో ఫ్రూట్..

ప్రపంచంలో ఎక్కడైనా పలాస జీడి పప్పునే ఎక్కువగా వినియోగిస్తుంటారు. అంతలా ఉంటుంది రుచి. కేక్ తిన్నా, మిల్క్ షేక్ తాగినా అందులో కనిపించే జీడిపప్పు మాత్రం పలాసదే. అంత ఎక్స్ పోర్టు పప్పుగా ఖ్యాతికెక్కింది. ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడి ప్రజలు తెల్ల బంగారమనే పిలుస్తారు. ‘జంబో’ ఫ్రూట్ అని సగర్వంగా చెప్పుకుంటారు. అందుకే సినిమాల్లో సైతం పలాస జీడిపప్పు ప్రాధాన్యత తెలియజెప్పుతూ భానుచందర్ హీరోగా వచ్చిన ‘రైలుదోపిడీ’ చిత్రంలో పలాస జీడి పప్పు గురించి ఏకంగా ఒక పాట పెట్టారు. ‘మొక్క జీడి పప్పురా..ఎంతో కులాస..ఎంతో పలాస’ అంటూ సాగిన ఈ పాట అప్పట్లో ఉర్రూతలూగించింది. ఇటీవల పలాస జీడి పరిశ్రమలు, ఇక్కడి ఆధిపత్య పోరును ఇతివ్రత్తంగా చేసుకోని వచ్చిన ‘పలాస 1978’ చిత్రం ప్రేక్షకాదరణ దక్కించుకుంది.

మహిళలకు విడదీయరాని బంధం..

జీడిపప్పుతో ఇక్కడి మహిళల జీవితం పెనవేసుకుపోయింది. తోటలో జీడి పిక్కల సేకరణ నుంచి పప్పు ప్రాసెసింగ్ వరకూ అన్ని బాధ్యతలు మహిళలే చూస్తారు. ఎక్కడైనా పరిశ్రమల్లో కానీ, సాగులో కానీ ముప్పావు వంతు పురుషులు ఉంటే.. మిగతా పావు వంతే మహిళలు కనిపిస్తారు. కానీ జీడి సాగు, పరిశ్రమల్లో అయితే ఇందుకు విరుద్ధం. మహిళలు ముప్పావు మంది ఉంటే.. పురుషులు కేవలం పావు వంతు మాత్రమే ఉంటారు. చివరకు జీడి పప్పు నాణ్యతా, రకం తేల్చే బాధ్యత కూడా మహిళామణులదే. ఉత్తరాంధ్రలో ఇతర పరిశ్రమల్లో ఎంతమంది పనిచేస్తుంటారో.. అంత కంటే ఎక్కవ జీడి పరిశ్రమల్లో పనిచేస్తుంటారు. కాలేజీ విద్య పూర్తిచేసుకున్న యువతులు జీడి ప్రాసెసింగ్ యూనిట్లనే ఉపాధి మార్గాలుగా ఎంచుకున్నారంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. కిలోపప్పు ఒలిచేందుకు రూ.25 లు చెల్లిస్తారు.రోజుకు ఒక్కో మహిళ 15 కిలోల వరకూ పప్పు ఒలిచే అవకాశముంది. అంటే సుమారు రోజుకు రూ.500 పైగానే ఆదాయం సమకూరుతుంది. ఇంటి పట్టునే ఉండి కుటుంబమంతా పప్పు ఒలుచుకుంటే రూ.2 వేలకుపైగా ఆదాయం సమకూరుతుంది. అందుకే మిగతా ప్రాంతాల కంటే ఇక్కడి మహిళలు ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉన్నారని కొన్ని సర్వేలు సైతం చెబుతున్నాయి.

ప్రభుత్వం ద్రుష్టి..

తాజాగా జీడి ప్రాసెసింగ్ యూనిట్లపై ప్రభుత్వం ద్రుష్టిసారించింది. పైసా విలువ కూడా చేయదని పిక్క తీసేసిన జీడి పండు చెత్తకుప్పల పాలయ్యేది. ఇలా ఎకరాకు 4 టన్నుల చొప్పున జీడి పండు వృధా అయ్యేది. కానీ, మూణ్నెల్ల క్రితం తూర్పు గోదావరి జిల్లా గంగవరం మండలానికి చెందిన ‘వైఎస్సార్‌ చేయూత’, ‘ఆసరా’ మహిళా లబ్ధిదారులు వినూత్నంగా ఆలోచించారు. జీడి మామిడి పండును ప్రాసెసింగ్‌ చేయడం ద్వారా జ్యూస్, సోడా, జామ్, పచ్చళ్లు తయారుచేసే ఓ కుటీర పరిశ్రమకు శ్రీకారం చుట్టారు.అదే ఇప్పుడు రాష్ట్రంలో కోట్ల రూపాయల కొత్త సంపద సృష్టిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న టానేజర్‌ అనే స్వచ్ఛంద సంస్థ వీరికి సాంకేతిక సహకారం అందించింది. దీంతో వీరంతా కలిసి రూ.18 లక్షల ఖర్చుతో కుటీర పరిశ్రమను ఏర్పాటు చేశారు. ముగ్గురు మహిళలు రైతుల నుంచి పండు సేకరించడంతో పాటు, ప్లాంట్‌ నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. ఇలా దేశంలోనే మొట్టమొదటిసారి జీడి పండు నుంచి ఉప ఉత్పత్తులను తయారుచేసే ప్రక్రియకు ఇక్కడ బీజం పడింది. మొదటగా జ్యూస్, సోడాల తయారీ మొదలుపెట్టారు.

About the Author

Leave a Reply

*